రాష్ట్రంలో గూండాగిరి రాజ్యమేలుతోంది : అచ్చెన్నాయుడు

టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని తక్షణం విడుదల చేయాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాడు డిమాండ్ చేశారు. నెల రోజుల క్రితం ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో దళిత మహిళను అత్యాచారం చేసి కిరాతకంగా హత్య చేశారన్నారు. ఆ నిందితులను అరెస్టు చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని చలో పులివెందుల చేపట్టిన నేతలపై అక్రమంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడమే కాకుండా తెదేపా ఎమ్మెల్సీ బీటెక్ రవిని అరెస్టు చేశాని తెలిపారు. 

తక్షణమే బీటెక్ రవిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అంతర్జాతీయ దొంగలకు బెయిలిచ్చి రోడ్ల మీద తిప్పుతున్నారని, ప్రజా పోరాటం చేసిన వారిపై కేసులు పెట్టి జైళ్లో పెడతారా? రాష్ట్రంలో గూండా గిరి రాజ్యమేలుతోందని విమర్శించారు. రాష్ట్రంలో రాక్షస  సంస్కృతి  ఎగిసి పడుతోందన్నారు. తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. 

అధికారం శాశ్వతం కాదన్న విషయం గుర్తుంచుకుంటే మంచిదన్నారు. న్యాయం అడిగితే ఏ విధంగా అట్రాసిటీ కేసులు పెడతారు? జగన్ రెడ్డి ప్రభుత్వ తీరు నిందితులకు రాజమార్గం పట్టేలా ఉందని తెలిపారు. దేశంలో ఎక్కడాలేనంతగా అట్రాసిటీని నిర్వీర్యం చేస్తున్నారన్నారు. చేతనైతే నిందితులకు శిక్ష వేసి, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. 

అంతేకానీ న్యాయం చేయండని అడిగిన వారిని అరెస్టు చేయడమేంటని ప్రశ్నించారు. చట్టాలను మట్టు పెడుతున్న వైసీపీ ప్రభుత్వ చర్యలు రాజ్యాంగ సంక్షోభానికి నిదర్శనమన్నారు. ఇష్టాను సారంగా దళితులపై అత్యాచారాలు, దాడులు చేయండి.. మీకు మేము రక్షణగా ఉంటామని కిరాయి మూకలకు భరోసా ఇస్తున్నారా జగన్ రెడ్డి అని ప్రశ్నించారు. దేశం మొత్తంలో జరిగే అరాచకాలన్నీ.. మన రాష్ట్రంలో జరుగుతున్నాయన్నారు. 

ఎన్ని కేసులు పెట్టినా దళిత, ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసం టీడీపీ నిరంతరం పోరాటం చేస్తుందన్నారు.  కూల్చివేతలు, కక్షసాధింపులు, అణచివేతలు, దాడులు చేయడం, అక్రమ కేసులు బనాయించడం చేస్తున్నారన్నారు. జగన్ పాలనలో అరాచకం వికృత రూపం దాల్చిందన్నారు. ఏ నియంత పాలనలోనూ కనిపించని దౌర్జన్య కాండ, నిర్భందం రాష్ట్రంలో కొనసాగుతోందని అచ్చెన్నాయుడు విమర్శించారు.   

 

Leave a Comment