అమ్మ చివరి మాట కోసం కోట్ల ఆస్తి విరాళం ఇచ్చిన బిడ్డలు..!

ఆస్తి కోసం తల్లిదండ్రులతో, సోదరులతో గొడవలు, ఘర్షణలకు దిగుతున్న నేటి సమాజంలో.. కన్న తల్లి చివరి కోరిక మేరకు కోట్ట రూపాయలు విలువ చేసే ఆస్తిని వదులుకున్నారు ఆ బిడ్డలు.. ఆస్తి మొత్తాన్ని జగన్నాథ ఆలయానికి విరాళంగా ఇచ్చారు. ఒడిశాలోని నవరంగ్ పూర్ జిల్లా నవరంగౌర్ కు చెందిన ఓ మహిళ డిసెంబర్ 2న అనారోగ్యంతో మరణించింది. 

ఆమెకు కుమారులు లేరు. ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వారందరికీ పెళ్లిళ్లు జరిపించింది. ఆమె భర్త కూడా అనారోగ్యంతో మంచం పట్టాడు. ఆమెకు నవరంగౌర్ పట్టణంలో మూడంతస్తుల భవంతి ఉంది. దాని విలువ కోటి రూపాయలకు పైనే ఉంటుంది. 25 గదులున్న ఆ భవంతిలో ప్రస్తుతం పది కుటుంబాలు అద్దెకు ఉంటున్నాయి. అద్దె రూపంలో వేలాది రూపాయల ఆదాయం వస్తుంది. 

ఆ ఆస్తిని పట్టణంలోని జగన్నాథ ఆలయానికి విరాళంగా ఇచ్చేయాలని ఆ తల్లి కోరింది. దీంతో ఆమె మరణించిన 14వ రోజున తన ముగ్గురు కుమార్తెలు వచ్చి తమ తల్లి చివరి కోరిక నెరవేర్చారు. ఆలయ నిర్వాహకులను కలిసి ఆస్తికి సంబంధించిన పత్రాలను అందజేశారు. గదుల ద్వారా వస్తున్న అద్దె రుసుమును కూడా వారినే వసూలు చేసుకోవాల్సిందిగా కోరారు. తల్లి చివరి కోరిక కోసం ఒకే మాటపై నిలబడిన ఆ అక్కాచెల్లెళ్లపై ప్రశంసల వర్షం కురుస్తోంది. 

 

Leave a Comment