నేరగాళ్ల స్వర్గంగా ఆంధ్రప్రదేశ్ ను మార్చారు :  యనమల

దేశంలోనే గరిష్ట అప్పులు, కనిష్ట అభివృద్ది రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిదే అని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. అప్పుల భారం ప్రజలపై, పప్పుబెల్లాలు వైసిపి నాయకులకు అంటూ ఎద్దెవా చేశారు. 13 జిల్లాలలో అభివృద్ది లేదని, సంక్షేమం వైసిపి కార్యకర్తలకే అని ఆరోపించారు. 

రోడ్లు, డ్రెయిన్లు తదితర ఫిజికల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ది లేదని యనమల పేర్కొన్నారు.  విద్య, వైద్యం వంటి సోషల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ది లేదన్నారు. ఉద్యోగులకు టిఏ, డిఏలు లేవని, చివరికి రిటైర్డ్ ఉద్యోగులకు పించన్లు కూడా ఇచ్చే పరిస్థితి లేదని ఆరోపించారు. 6 డిఏలు పెండింగ్ పెట్టిన చరిత్ర ఎన్నడూ లేదన్నారు. అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు నెలల తరబడి జీతాలు పెండింగ్ లో ఉన్నాయని, ఉద్యోగుల శక్తి సామర్ధ్యాలనే కుంగదీశారని విమర్శించారు.  

ఫిస్కల్ డెఫిసిట్ రూ 1,10,320 కోట్లకు చేరుతోందన్నారు. ఏడాదిలోనే రూ 73,812కోట్లు అప్పు చేసినట్లు కాగ్ వెల్లడించిందన్నారు. రాష్ట్ర రియల్ జిఎస్ డిపి 7.6% పడిపోయిందని జాతీయ సగటు లెక్కలే చెప్పాయన్నారు. జీఎస్ డిపిలో అప్పుల నిష్పత్తి 37% పెరిగిందని, గతం కన్నా 10% పెరిగిందని చెప్పారు. 

జిఎస్ డిపిలో ద్రవ్యలోటు 13%కు పెరిగిందన్నారు. ఎఫ్ డి 8% అధికం అయ్యిందన్నారు. జిఎస్ డిపిలో రెవిన్యూ లోటు(ఆర్ డి) మైనస్ 3-4% కు చేరిందన్నారు. గత ఏడాది ఫస్ట్ హాఫ్ ఇయర్ కన్నా ఈ ఏడాది తొలి 6నెలల్లో రెవెన్యూ వసూళ్లు 6% పెరిగాయన్నారు.. అప్పులు రెట్టింపు చేశారని, ఖర్చులు 23% అదనంగా చేశారని విమర్శించారు. 

కేంద్రసాయం రూ7,700కోట్లు అదనంగా అందిందని, కరోనా నివారణకు అదనపు సాయం అందిందని పేర్కొన్నారు. ఎక్సైజ్ డ్యూటీ 100% పైగా పెరిగిందన్నారు. ప్రజలపై ఎడాపెడా పన్నులు, సుంకాలు విధించారని ఆరోపించారు. 19నెలల్లో రూ.75 వేల కోట్ల పన్నుల భారం మోపారన్నారు. ప్రతి నెలా రూ.4వేల కోట్లు పన్నుల భారంతో ప్రజల నడ్డి విరిచారన్నారు. 

అగమ్యగోచరంగా ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక పరిస్థితిని దిగజార్చారని. ఆర్ధిక నిర్వహణ చేతగాకే ఈ దుస్థితి తెచ్చారని యనమల విమర్శించారు. ఈ డబ్బంతా ఏమైంది..? ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. ప్రచార ఆర్భాటాలే తప్ప ప్రజలు చేసింది శూన్యమన్నారు. వడ్డీ చెల్లింపులు పెరిగిపోతున్నాయన్నారు. ఎవరి జేబుల్లోకి వెళ్లిందో ప్రజలే అర్ధం చేసుకోవాలన్నారు.

తలసరి ఆదాయం, తలసరి కొనుగోలు శక్తి, పొదుపు శక్తి దారుణంగా పడిపోయాయని, నిత్యావసరాల ధరలు చుక్కలనంటాయని విమర్శించారు. సంక్షేమం నత్తనడకన సాగుతోందన్నారు. మార్కెట్ ధరలకు, చేసే సంక్షేమానికి పొంతనే లేదన్నారు. ఎన్నడూ లేని కష్టాల్లో ప్రజలు చిక్కుకున్నారని యనమల వ్యాఖ్యానించారు.

‘‘‘గవర్నమెంట్ టెర్రరిజం’’తో ఏపికి ఎనలేని చెడ్డపేరు తెచ్చారు. శాంతిభద్రతలను అధ:పాతాళానికి దిగజార్చారు. ఏపి అంటేనే పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడి దారులు భయపడే స్థితి తెచ్చారు. నేరగాళ్ల స్వర్గంగా ఆంధ్రప్రదేశ్ ను మార్చారు. ప్రతిపక్షాలపై దాడులు, ప్రజలపై దౌర్జన్యాలు, ఆలయాలపై దాడులతో అల్లకల్లోలం చేశారు. ఈ దుశ్చర్యలకు ప్రజలే తగిన బుద్ది చెప్పాలి. బాధిత ప్రజానీకమే వైసిపికి గుణపాఠం చెప్పాలి.’ అంటూ యనమల ఫైర్ అయ్యారు.

 

Leave a Comment