ప్రజాగ్రహంలో జగన్‌ ప్రభుత్వం : సునిల్‌ డియోదర్‌

ముఖ్యమంత్రి జగన్‌మోహనరెడ్డి తన వ్యతిరేకవిధానాలతో ప్రజాగ్రహానికి గురైయ్యారని భాజపా జాతీయ కార్యదర్శి, రాష్ట్ర సహ ఇన్‌ఛార్జి సునిల్‌ డియోధర్‌ విమర్శించారు. గూడూరులో శనివారం నిర్వహించిన ఎస్సీమోర్చా సదస్సులో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల ముందు రావాలి జగన్‌…కావాలి జగన్‌ అని నినాదం ఇచ్చిన జగన్‌….సిఎం అయ్యాక రావాలి ఏసు…కావాలి ఏసు అని నినాదాన్ని మార్చారని దీనిని భాజపా సహించదని అన్నారు.

ఈ ఎన్నికల్లో జనం పోవాలి బాబు, పోవాలి జగన్‌….రావాలి భాజపా…పవన్‌ అని నినదిస్తున్నారన్నారు. ఇప్పటి వరకు తెదేపా తిరుపతి పార్లమెంటు సీటును గెలవలేదని, ఇక ముందు కూడా గెలవదని అన్నారు. ఉప ఎన్నికల్లో భాజపా, జనసేన అభ్యర్ధి మాత్రమే గెలుస్తారన్నారు. గతంలో ఈ నియోజకవర్గం నుంచి గెలిచిన భాజపా ఎంపీ వెంకటస్వామి తిరుపతి కోసం ఎంత కష్టపడ్డారో ప్రజలకు తెలుసన్నారు. గూడూరులో జరిగిన ర్యాలీ రాష్ట్రంలో 150 వరకు ఆలయాలు, విగ్రహాల ధ్వంసానికి వ్యతిరేకంగా జరిగిందని ప్రభుత్వం గుర్తించాలన్నారు.

పులివెందుల నియోజకవర్గంలో ఎప్పుడూ వైఎస్‌ కుటుంబమే గెలుస్తోందని కాని అక్కడి ఆలయంలో వినాయకుడి విగ్రహం మాయం కావడం చూస్తుంటే రాష్ట్రంలోనే జగన్‌ పాలనలో పట్టుకోల్పోయారని అర్ధం అవుతుందన్నారు. అంబేద్కర్‌ తండ్రి పేరు రాముడని, ఎన్టీయార్‌లోనూ రాముడున్నాడని, కమ్యూనిస్టు నాయకుడు సీతారాంలో రాముడు, సీత ఉన్నారని కాని రాముడి మందిరాన్ని ద్వంసం చేస్తే కమ్యూనిస్టులు ఈ సంఘటనను వ్యతిరేకించడం లేదన్నారు. రాముడు, వేంకటేశ్వరుడి సేవకులుగా వారి పట్ల ఎలాంటి అపచారం జరిగినా పోరాడే భక్తులుగా భాజపా నిలబడుతుందని చెప్పారు. 2024 ఎన్నికల్లో రాష్ట్రంలో భాజపా-జనసేన ప్రభుత్వం ఏర్పాటుకు ఈ తిరుపతి ఉప ఎన్నికల విజయం నాందికావాలని కోరారు.

భాజపా ఎప్పుడూ దళితుల పక్షమే : సోమువీర్రాజు
దళితులకు అండగా ఉండేది భాజపానే అని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు ఉద్గాటించారు. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గంలో ఎస్సీలు ఇంత పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించి సదస్సు ఏర్పాటుచేసినందుకు ఎస్సీమోర్చా రాష్ట్ర అధ్యక్షులు గుడిసె దేవానంద్‌కు అభినందనలు తెలిపారు. భాజపాలో ఎంతో మంది పనిచేస్తున్నా ఏనాడూ వారి కులం గురించి అడిగే సందర్బం ఉండేది కాదని అన్నారు. ఒక ఎస్సీని రాజ్యసభకు పంపేందుకు వాజ్‌పేయి ఎస్సీకోసం వాకబు చేసిన సందర్భం గుర్తుచేసుకున్నారు.

దేశంలో అత్యధికంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్న పార్టీ భాజపానే అంటూ ఒక ఎస్సీవర్గానికి చెందిన వ్యక్తిని దేశ అత్యున్నతమైన పదవికి ఎంపిక చేసి రాష్ట్రపతిగా చేసినది భాజపానే అన్నారు. అలాగే వెనుకబడిన వర్గానికి చెందిన వ్యక్తి మోదీని దేశప్రధానిగా చేసిన పార్టీ భాజపాగా ప్రశంసించారు. ఇంకా ఆయన ఇలా అన్నారు……

70 వ దశకంలో ఏర్పాటైన జనతా పార్టీ ప్రభుత్వంలో వందమంది జనసంఘ్‌ సభ్యులున్నారు. ఆనాడు ప్రధాని పదవికి బాబూ జగజ్జీవన్‌రాంను ప్రతిపాదించిన పార్టీ భాజపానే. అలా ఎస్సీల పక్షాన అనేక సందర్బాల్లో భాజపా ఉంది. వాజ్‌పేయి ప్రధానిగా ఉండగా ఎస్సీ కమిషన్‌ను విడగొట్టి ఎస్టీలకు ప్రత్యేక కమిషన్‌ ఏర్పాటుచేశారు. ఎస్టీలకు మంత్రివర్గంలో స్దానం కల్పించారు. సమాజంలో అట్టడుగు వర్గాలుగా ఉన్న మలమూత్రాలు శుభ్రం చేసే కార్మికులను ఉద్దరించేందుకు వారికి కర్మచారి కమిషన్‌ వేశారు. వారికి చేతులతో కాకుండా యంత్రాలతో పనిచేసేలా వాహనాలు, యంత్రపరికాలు బ్యాంకుతో సంబంధం లేకుండా నేరుగా అందచేశారు.

60 ఏళ్ల కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ఎస్సీ, ఎస్టీలకు ఎలాంటి అభివృద్ది జరగలేదు. వాజ్‌పేయి ఏర్పాటుచేసిన జాతీయ ఎస్సీ అభివృద్ధి ఫెడరేషన్‌ కార్యక్రమాలను కాంగ్రెస్‌ ప్రభుత్వం తన హయాంలో నిలిపివేసింది. తర్వాత వచ్చిన మోదీ వాటిని అమలుచేశారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఇచ్చిన రూ.13 లక్షల విలువైన ఇన్నోవా కార్లు ఈ పథకంలోనివే. దానికాయన లబ్దిదారులతో థాంక్యు సీఎం అని ప్రచారం చేయించుకున్నారు.ఇప్పటి జగన్‌ ప్రబుత్వం ఈ పథకాన్ని రెండేళ్లుగా అమలుచేయడం లేదు. చంద్రబాబు, వైఎస్‌రాజశేఖరరెడ్డిల కుటుంబం రాష్ట్రాన్ని పాలిస్తోంది. వారివి కుటుంబపార్టీలు.

భాజపా మాత్రమే సకల జనుల పార్టీ. ఎపీని గుజరాత్‌ తరహా మోడల్‌లో భాజపా అభివృద్ది చేస్తుంది. బడుగు, బలహీనవర్గాల ఆర్దిక స్తితిగతుల్ని మెరుగుపరిచేందుకు కార్పొరేట్‌ సెక్టార్‌ కంపెనీల్ని ఎపీలో నిర్మిస్తాం. జగన్‌కు 151 స్దానాలిస్తే ఎపీలో ప్రతిరోజూ ఆలయాలు నేలమట్టం అయ్యే పరిస్తితి నెలకొంది. పులివెందుల్లోనూ ఆలయాలు నేలమట్టం అవుతున్నాయి. రామతీర్దంలో రాముడికి ఘోరమైన అవమానం జరిగింది. అంబేద్కర్‌ తండ్రిపేరు రామ్‌జీ. అలాంటి రాముడికి అయోధ్యలో భాజపా రామమందిరం నిర్మిస్తోంది.

అలాంటి చారిత్రక పురుషుడి తలను విజయనగరం జిల్లాలో తునాతునకలు చేస్తే ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తే ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించి ఉద్యమిస్తున్నారు. ఎస్సీ విద్యార్తుల కు కేంద్రప్రభుత్వం రూ.60 వేల కోట్లు స్కాలర్‌షిప్‌లు మంజూరుచేసింది. కాని జగన్‌ ప్రభుత్వం జీ.ఒ.నెంబరు 77 విడుదల చేసి ప్రభుత్వ విద్యాలయాల్లో మాత్రమే ఉపకారవేతనాలు ఇస్తామని ప్రకటించింది. ఇది దళిత విద్యార్థుల విద్యాభ్యాసానికి అడ్డుపడుతుందని ఈ జీవోను అమలుచేయరాదని జగన్‌కు లేఖరాసాం. సామాన్యప్రజలు, దళితులు, అట్టడుగువర్గాల అభివృద్దే భాజపా ధ్యేయం.

Leave a Comment