సీఎం జగన్ కొత్త పథకానికి శ్రీకారం.. చిరు వ్యాపారులకు వడ్డీ లేకుండా రుణం..

ఏపీ ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. చిరు వ్యాపారులకు రూ.10 వేల చొప్పున రుణం అందించేందుకు ‘జగనన్న తోడు’ పథకాన్ని ప్రారంభించనుంది. ఫుట్ పాత్ లు, వీధుల్లో వస్తువులు, తినుబండారాలు విక్రయించే చిరు వ్యాపారులకు ఆర్థిక భరోసా కల్పించనుంది. ఈ పథకాన్ని ఈనెల 6న సీఎం జగన్ ప్రారంభించనున్నారు. 

ఈ పథకం కింద బ్యాంకుల నుంచి చిరు వ్యాపారులకు రుణాలు ఇప్పించడంతో పాటు ఆ రుణాలపై అయ్యే వడ్డీ మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. తీసుకున్న రుణాన్ని మాత్రం వాయిదా పద్ధతిలో లబ్ధిదారులు చెల్లిస్తే సరిపోతుంది. ఫుట్ పాత్ లు, వీధుల్లో తోపుడు బండ్లు, సైకిళ్లపై వివిధ వస్తువులు, కూరగాయలు, పండ్లు, అమ్ముకుని జీవనం సాగించే వారితో పాటు రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్లు నడిపే వారు, గంపలు లేదా బుట్టలపై వివిధ వస్తువులు అమ్ముకునే వారంతా ఈ పథకం కింద లబ్ధిపొందనున్నారు. 

సంప్రదాయ వృత్తులు చేసే హస్త కళాకారులకు రూ.10 వేల వరకు వడ్డీ లేని రుణాలను ప్రభుత్వం అందించనుంది. ఈ పథకానికి రూ.474 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేయనుంది. కాగా, ఇప్పటి వరకు ఈ పథకం కింద 9.08 లక్షల మంది లబ్ధిదారులను అధికారులు గుర్తించారు. ఇంకా ఎవరైనా అర్హులుంటే సంబంధిత గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 

 

Leave a Comment