జగన్ పతనం తిరుపతి నుంచే ప్రారంభం కావాలి : చంద్రబాబు

అమరావతిలో పనులు ఆపేయడం, పోలవరం ప్రాజెక్టు పనులు నిర్లక్ష్యం చేయడం, ప్రత్యేక హోదా తెస్తామని నమ్మించి మోసం చేయడం జగన్ చేసిన ద్రోహాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. మంగళవారం టీడీపీ 175 నియోజకవర్గాల ఇన్ ఛార్జ్ లు, ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ వైఎస్ జగన్ ఇచ్చిన హామీలన్నీ నీటి మూటలుగా తేలిపోయిందన్నారు. 

అమరావతి నిర్మాణం పూర్తయితే రూ లక్ష కోట్ల నుంచి 2లక్షల కోట్ల సంపద రాష్ట్రానికి ఏర్పడేదన్నారు. ఎన్నో పెట్టుబడులు, అనేక పరిశ్రమలు వచ్చేవని, 13 జిల్లాల యువతకు ఉద్యోగాలు వచ్చేవని, తన స్వార్ధం కోసం జగన్మోహన్ రెడ్డి మొత్తాన్ని సర్వనాశనం చేశారని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే విశాఖతో సహా ఉత్తరాంధ్రకు మేలు కలిగేవన్నారు. పంచ నదుల అనుసందానం పనులు కొనసాగిస్తే రాయలసీమ, ఉత్తరాంధ్ర కూడా సస్యశ్యామలం అయ్యేవన్నారు. పోలవరం ఎత్తు 41.15మీటర్ల కే తగ్గిస్తే ఏపికి తీవ్ర నష్టం వస్తుందని, ఉత్తరాంధ్ర, సీమ జిల్లాలకు నీటి కొరత తీరాలంటే పోలవరం పూర్తి కావాలని పేర్కొన్నారు. 

ఇసుకపై రోజుకు ఎంత దోపిడీ చేస్తున్నారు.. మద్యంపై ప్రతి రోజూ ఎంత దండుకుంటున్నారు..అంటూ ప్రశ్నించారు. మైనింగ్ లో ఎన్ని కుంభకోణాలు చేశారు..? ఇళ్ల స్థలాలకు భూసేకరణలో ఎంత కొట్టేశారు..? వీటన్నింటినీ బైటపెట్టే ధైర్యం వైసిపికి ఉందా..అంటూ సవాల్ విసిరారు. మీ చేతగాని తనంతో ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా టిడిపిపై నిందలు వేయడం ఏమిటని, ఇళ్ల స్థలాలు ఇస్తే వైసిపి భాగోతం బైటపడుతుందనే జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. వైసిపి అరాచకాలను, అవినీతి కుంభకోణాలను ఎండగట్టాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు.

ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి..

తిరుపతి పార్లమెంటు ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని చంద్రబాబు పేర్కొన్నారు.. జగన్మోహన్ రెడ్డి పతనం తిరుపతి నుంచే ప్రారంభం కావాలన్నారు. వైసిపి ప్రజా వ్యతిరేక చర్యలకు గుణపాఠం చెప్పాలన్నారు. ముస్లింలు, ఎస్సీ, ఎస్టీ, బిసిలపై దాడులకు అడ్డుకట్ట వేసేందుకు తిరుపతి నుంచే నాంది పలకాలన్నారు. వైసిపి అరాచకాలకు గుణపాఠం చెప్పే వేదిక ఈ ఉప ఎన్నిక అని, టిడిపి గెలుపే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని చంద్రబాబు టిడిపి శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. 

 

Leave a Comment