గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు.. నాలుగు పరీక్షల్లో ఉత్తీర్ణులైతేనే ప్రొబేషన్ పూర్తి..

 ప్రొబెషన్ కాలంలో ఉన్న గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది శిక్షణ కాలంలో నిర్వహించే నాలుగు రకాల పరీక్షల్లో ఉత్తీర్ణులైతేనే వారి ప్రొబెషన్ ప్రకటించడం జరుగుతుందని గ్రామ, వార్డు సచివాలయాల ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ పేర్కొన్నారు. 

బుధవారం వార్డు సచివాలయాల మాస్టర్ ట్రైనర్లు, వైఎస్ఆర్ జిల్లా గ్రామ సచివాలయాల మాస్టర్ ట్రైనర్ల శిక్షణ కార్యక్రమాల ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది రెండేళ్ల ప్రొబెషన్ లో ఉన్నారని, ఈ రెండేళ్ల కాలంలో వారికి అనేక రకాల శిక్షణ కార్యక్రమాలు ఉంటాయని అన్నారు. 

విధుల నిర్వహణ, ప్రభుత్వ పథకాలు, ప్రవర్తనా నియమావళి గురించి నిర్వహించే ఈ శిక్షణ కార్యక్రమంలో నాలుగు దఫాలుగా పరీక్షలు నిర్వహిస్తామని, ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులు కాలేకపోతే ప్రొబెషన్ పొడిగింపు ఉంటుందని తెలిపారు. ప్రతి ఉద్యోగి కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలని, డిజిటల్ సహాయకులు సెలవులో ఉంటే, సచివాలయాల్లో పనిచేసే ఇతర సిబ్బంది డిజిటల్ సేవలు అందించడానికి సంసిద్ధులుగా ఉండాలని సూచించారు. 

Leave a Comment