ఉద్యోగం పేరుతో నిరుద్యోగికి రూ.18 లక్షలు టోకరా..!

ఉద్యోగం పేరుతో ఓ సైబర్ నేరగాడు నిరుద్యోగికి రూ.18 లక్షలు టోకరా పెట్టాడు. మోసపోయినట్లు ఆలస్యంగా గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కర్నూలు జిల్లా పగిడ్యాల మండలం పడమర ప్రాతకోట గ్రామానికి చెందిన ఒగిలి శ్రీనివాసులు పదో తరగతి వరకు చదువుకొని ప్రొక్లెయిన్ డ్రైవర్ గా ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. 

రెండు నెలల క్రితం ఓ నంబర్ నుంచి శ్రీనివాసులుకు ఫోన్ వచ్చింది. లిఫ్ట్ చేయగా అమ్మాయి హిందీలో మాట్లాడింది. ఆమె చాలా చనువుగా మాట్లడుతూ రికార్డింగ్ చేసుకుంది. అనంతరం మరో నెంబర్ నుంచి శ్రీనివాసులు సెల్ కు ఫోన్ వచ్చింది. అమ్మాయితో మాట్లాడిన రికార్డింగ్ ను చూపుతూ బ్లాక్ మెయిల్ చేశాడు. తాము చెప్పినట్లు చేయాలని ఆదేశించాడు. 

కాల్ బాయ్ గా ఉద్యోగం ఇస్తామని, మొదట లైసెన్స్ కోసం రూ.30 వేలు ఇవ్వాలని చెప్పాడు. అతను చెప్పినట్లే అకౌంట్ కు ట్రాన్స్ ఫర్ చేశాడు. అనంతరం ఫోన్ పే, గూగుల్ పే ద్వారా రూ.1,07,700 జమ చేశాడు. ఎస్బీఐ, కెనరా, సొసైటీ బ్యాంక్ ఖాతాలకు రూ.16,74,550 జమ చేశాడు. 

ఉద్యోగం ప్రస్తావన ఎత్తినప్పుడల్లా అప్పుడు ఇప్పుడూ అంటూ కాలయాపన చేస్తుండటంతో పాటు పదేపదే డబ్బు ఇవ్వాలని అడుగుతుండటంతో మోసపోయినట్లు భావించి ముచ్చుమర్రి పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. 

Leave a Comment