219 మందితో టీడీపీ రాష్ట్ర కమిటీ ఏర్పాటు..

ఆంధ్రప్రదేశ్ టీడీపీలో ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విప్లవాత్మక మార్పులకు నాంది పలికారు. జిల్లా పార్టీ వ్యవస్థకు స్వస్తి పలికి పార్లమెంటరీ పార్టీ వ్యవస్థను తీసుకొచ్చారు. ఇటీవల పొలిట్ బ్యూరో, జాతీయ కమిటీలను ప్రకటించిన టీడీపీ శుక్రవారం ఏపీ రాష్ట్ర కమిటీని ప్రకటించింది. 

219 మందితో టీడీపీ ఆంధ్రప్రదేశ్ కమిటీని నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఇందులో 18 మంది ఉపాధ్యక్షులు, 16 మంది ప్రధాన కార్యదర్శులు, 18 మంది అధికార ప్రతినిధులు, 58 మంది కార్యనిర్వాహక కార్యదర్శులు, 108 మంది రాష్ట్ర కార్యదర్శులను నియమించారు.  

బడుగు, బలహీన వర్గాలకు ఈ కమిటీలో అధిక ప్రాధాన్యత లభించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా 61 శాతం బడుగు, బలహీన వర్గాల వారికి పదవులు దక్కాయి. బీసీలకు 41 శాతం, ఎస్సీలకు 11 శాతం, ఎస్టీలకు 3 శాతం, మైనార్టీలకు 6 శాతం పదవులు దక్కాయి. వారసత్వం కంటే పనితీరుకే ప్రాధాన్యత ఇస్తూ ప్రతిపక్షంలో గళం వినిపిస్తున్న వారికి పదవులు కట్టబెట్టారు. 

అంతే కాక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ కి కీలక పదవిని అప్పగించారు. ఆయనకు కేంద్ర కమిటీ జనరల్ సెక్రటరీ పదవిని ఇచ్చారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని కమిటీ పదవులు ఇచ్చినట్లు తెలిపారు. రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి వచ్చే లక్ష్యంతో కమిటీ పనిచేస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు. 

Leave a Comment