రైతు ఉద్యమానికి శుబ్ మన్ గిల్ కుటుంబం మద్దతు..!

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఉద్యమం నిర్వహిస్తున్నారు. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఉద్యమానికి సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు మద్దతు తెలుపుతున్నారు. తాజాగా టీమిండియా క్రికెటర్ శుబ్ మన్ గిల్ కుటుంబం రైతు ఉద్యమానికి మద్దతు తెలిపింది.  

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనకు పూర్తి మద్దతు ఇస్తున్నట్లు గిల్ తండ్రి లిక్వీందర్ సింగ్ పేర్కొన్నారు. తన తండ్రి రైతుల ఉద్యమంలో పాల్గొంటానని ఇంట్లోంచి బయలుదేరారని, అయితే ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వద్దని చెప్పామని అన్నారు. 

తాము వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చామని, గిల్ కి చిన్ననాటి నుంచి వ్యవసాయం అంటే చాలా ఇష్టమని చెప్పారు. తాతలు, మామల దగ్గర్నుంచి వ్యవసాయం అంటే ఏంటో ప్రత్యక్షంగా నేర్చుకున్నాడున్నారు. గిల్ ఎక్కువగా పంట పొలాల్లోనే తన ప్రాక్టీస్ చేసేవాడని, ఒక వేళ గిల్ క్రికెటర్ కాకపోయుంటే కచ్చితంగా రైతు అయ్యేవాడని పేర్కొన్నారు. 

క్రికెట్ నుంచి పూర్తిగా తప్పుకున్నాక ఊళ్లో ఉన్న వ్యవసాయక్షేత్రంలో పనులు చేసుకుంటూ జీవితాన్ని గడిపేస్తానని గిల్ చాలా సార్లు తన చెప్పాడని లఖ్వీందర్ పేర్కొన్నారు. కాగా గిల్ ఇప్పుడు ఆసీస్ పర్యటనలో ఉన్నాడు. బుధవారం ఆస్ట్రేలియా, ఇండియా మధ్య జరిగిన మూడో వన్డేలో ఓపెనర్ గా వచ్చి 33 పరుగులు చేశాడు.  

Leave a Comment