ఉగ్రదాడిలో ఇద్దరు తెలుగు జవాన్లు వీర మరణం..!

 జమ్మూ కశ్మీర్ లోని మచిల్ సెక్టార్ లో ఉగ్రవాదుల కాల్పుల్లో ఆదివారం తెల్లవారుజామున నలుగురు భద్రతా సిబ్బంది అమరులయ్యారు. వీరిలో ఇద్దరు ఆర్మీ ఆఫీసర్, బీఎస్ఎఫ్ జవాన్ ఉన్నారు. భద్రతా సిబ్బంది జరిపిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు కూడా మరణించారు. ఉత్తర కశ్మీర్ లోని కుప్వారా జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున 1 గంట సమయంలో ఎల్ ఓసీని దాటి ఉగ్రవాదులు చొరబాటుకు ప్రయత్నించిన సమయంలో ఘటన చోటుచేసుకుంది. 

కాగా మరణించిన జవాన్లలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు జవాన్లు కూడా ఉన్నారు. ఏపీలోని చిత్తూరు జిల్లా ఐరాల మండలం రెడ్డివారిపల్లెకు చెందిన ప్రవీణ్ కుమార్ రెడ్డి(37) అమరుడయ్యారు. ప్రవీణ్ కుమార్ హవాల్దార్ గా పనిచేస్తున్నాడు. అలాగే కమాండో ట్రైగింగ్ కూడా పొందారు. 18 ఏళ్ల క్రితం మద్రాసు రెజిమెంట్-18లో చేరాడు. ప్రవీణ్ కు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. 

ఉగ్రదాడుల్లో తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం కోమన్ పల్లి గ్రామానికి చెందిన ర్యాడ మహేశ్(26) అనే జవాన్ వీరమరణం పొందాడు. మహేశ్ ఐదేళ్లుగా సైన్యంలో పనిచేస్తున్నాడు. అక్టోబర్ వరకు డెహ్రాడూన్ లో పనిచేసిన మహేశ్ ఈనెల ప్రారంభంలో కశ్మీర్ కు బదిలీపై వెళ్లినట్లు తెలుస్తోంది. మహేశ్ ఏడాదిన్నర కిందట హైదరాబాద్ కు చెందిన యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. 

Leave a Comment